ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం బాగా అందుతోంది. నిధుల కేటాయింపు దగ్గర నుంచి కొత్త ప్రాజెక్టుల వరకూ అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది. విశాఖపట్నం- అరకు మార్గంలో నాలుగు లైన్ల రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. విశాఖ- అరకు రూట్లో పెందుర్తి - బౌడరా మధ్య ఎన్‌హెచ్-516బి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. పెందుర్తి నుంచి కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా బౌడరా వరకూ ఈ రోడ్డు ఉంది. అయితే ఈ రోడ్డును నాలుగు లైన్లకు విస్తరించాలని గతంలోనే ప్రతిపాదనలు వెళ్లాయి. భారతమాల పరియోజన కింద అనుమతులు కూడా మంజూరయ్యాయి. అయితే టెండరు ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. రహదారుల విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రహదారులు, ఎయిర్‌పోర్డులు, రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పెందుర్తి- బౌడరా నాలుగు లైన్ల రహదారి పనులకు కూడా మోక్షం లభించింది.రూ.956.21 కోట్లతో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. పెందుర్తి నుంచి బౌడరా వరకూ కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట మండలాల మీదుగా ఈ రోడ్డు ఉంది. అయితే విస్తరణ పనుల్లో భాగంగా చింతలపాలెం నుంచి బౌడరా వరకు 7 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును 11 మీటర్లకు విస్తరిస్తారు. మొత్తం 40.5 కిలోమీటర్ల మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 118 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది.
మరోవైపు రహదారి విస్తరణలో భాగంగా మూడు చోట్ల బైపాస్ రోడ్లను ప్రతిపాదించారు. కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రోడ్డును విస్తరిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మూడు బైపాస్‌లను ప్రతిపాదించారు. చింతలపాలెం నుంచి మంగళపాలెం, సీతంపేట, నిమ్మలపాలెం మీదుగా 11 కిలోమీటర్ల పొడవుతో ఒక బైపాస్ రోడ్డు.. వెంకటరమణపేట నుంచి 6 కిలోమీటర్ల మేర మరో బైపాస్ రోడ్డు, బౌడరా కూడలికి దగ్గరగా మూడో బైపాస్ ప్రతిపాదించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నాలుగు లైన్ల రహదారి విస్తరణకు టెండర్లు పిలవనున్నారు. ఖరారు ప్రక్రియ, భూసేకరణకు సమయం పట్టనుంది. ఇక కేంద్రం నుంచి కూడా సకాలంలో నిధులు విడుదలైతే.. పెందుర్తి- బౌడరా మధ్య నాలుగు లైన్ల రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్లవచ్చు.