ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా- గుంటూరు, తూర్పు- పశ్చిమగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును ఖరారు చేశారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేరును ప్రకటించారు. మరోవైపు 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరో ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన.. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుంది. మరోవైపు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఓటర్ల నమోదుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు.
మరోవైపు తెనాలి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును ఆయన త్యాగం చేశారు. పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లగా.. ఆ పార్టీ తరుఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేసి గెలుపొందారు. దీంతో అప్పటి త్యాగానికి ప్రతిఫలంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కింది.
మరోవైపు ఐ.పోలవరం మండలానికి చెందిన రాజశేఖర్.. గతంలో ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కాకినాడ రూరల్ టికెట్‌ను ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానం కూడా జనసేనకు వెళ్లగా.. రాజశేఖర్‌కు పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించారు. పేరాబత్తుల రాజశేఖర్ రాజశేఖర్ కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం కూడా ఆయనకు కలిసి వచ్చింది. మొత్తంగా ఇద్దరు నేతలకు గతంలో సీటు త్యాగం చేయడం, సామాజిక సమీకరణాలు కలిసి వచ్చాయని చెప్పాలి.