కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్ధిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికకు విఘ్నేశ్ అనే యువకుడు శనివారం నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం కడప రిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలు.. ఆరోగ్యం విషమించి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యార్థినిని గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లిన నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు 80 శాతం కాలినగాయాల్యాయి. బాధితురాలి ఆర్తనాదాలే విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి ఆమెను చికిత్స కోసం బద్వేలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుడ్ని పట్టుకోడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసింది. నిందితుడ్ని శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆటో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, మైనర్ బాలికను రప్పించిన నిందితుడు.. అనంతరం ఘాతుకానికి తెగబడ్డాడు.
బాధితురాలిని ఐదేళ్లుగా ప్రేమ పేరుతో విఘ్నేశ్ వేధింపులకు గురిచేశాడు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమిస్తున్నానని వెంటబడినట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడికి ఆరు నెలల కిందటే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని.. కానీ, పెళ్లైన తర్వాత కూడా తమ కుమార్తెను వేధించడం ఆపడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనను కలవకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించి.. విద్యార్థినిని అటవీ ప్రాంతానికి రప్పించాడు. ఆమె అతడి మాట వినకపోవడంతో డ్రస్‌కు లైటర్‌తో నిప్పంటించిన పారిపోయినట్లు తెలిసింది. అటు, విద్యార్థిని మృతికి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సంతాపం తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.