సమాజంలో తప్పుచేసినవారిని పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులే పెడదారి పట్టారు. ఖాకీ బట్టలు వేసుకుని చేతివాటం ప్రదర్శించారు. పేకాట శిబిరంపై దాడిచేసి.. పట్టుబడిన సొమ్మును నొక్కేశారు. అయితే, చివరకు జూదంలో పట్టుబడిన వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య నగదు విషయంలో తలెత్తిన వివాదంతో అడ్డంగా దొరికిపోవడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పేకాట సొమ్మును నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్సై సహా నలుగురిని సస్పెండ్ అయిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సెప్టెంబరు 8న పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పెరవలి ఎస్‌ఐ అప్పారావు, కానిస్టేబుళ్లు వెళ్లి పేకాట శిబిరంపై దాడిచేసి సుమారు 30 మందిని పట్టుకున్నారు. కానీ, ఏడుగురిపై మాత్రమే కేసు నమోదు చేసి.. దాదాపు రూ.6.5 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని నిడదవోలు సీఐ వద్దకు తీసుకెళ్లి.. అక్కడ మంతనాల తర్వాత రూ.55,500 మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు నమోదు చేశారు. అయితే, నొక్కేసిన సొమ్మును వాటాలు వేసుకోవడంలో తేడాలు రావడంతో విషయం బయటపడింది. ఎస్పీ నరసింహ కిషోర్ దృష్టికి వెళ్లడంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును భారీగా నొక్కేసినట్టు నిర్దరణ కావడంతో నిడదవోలు సీఐ వి.శ్రీనివాసరావు సహా నలుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.
పేకాట శిబిరంపై దాడిలో పాల్గొన్న సిబ్బందిలో ఒకరై కానిస్టేబుల్‌కు.. ఓ నిందితుడి తెలిసిన వ్యక్తి. దీంతో అతడు తన వద్ద రూ.లక్షను కానిస్టేబుల్‌కు ఇచ్చి దాచపెట్టమన్నాడు. ఈ విషయం మిగతా సిబ్బందికి తెలియకుండా కానిస్టేబుల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ పట్టుబడిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో వాళ్లు బయటకొచ్చారు. అయితే, ఆ మర్నాడు కానిస్టేబుల్ వద్దకు వచ్చిన నిందితుడు.. తాను ఇచ్చిన రూ.లక్ష ఇవ్వాలని అడిగాడు. ఆ మొత్తం పట్టుబడిన నగదులో కలిపేసినట్టు చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రూ.లక్ష ఇచ్చిన దృశ్యాల సీసీ కెమెరా ఫుటేజీని నిందితుడు బయట పెట్టడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్పీ విచారణ జరిపి, నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్సై అప్పారావు, రైటర్ బుద్ధేశ్వరరావు, కానిస్టేబుల్ ఆర్.ఎల్లారావులను బాధ్యులుగా గుర్తించారు. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ సదరు సిబ్బందిని శనివారం సస్పెండ్ చేశారు.