ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. తాను డౌన్ టు ఎర్త్ లీడర్‌నని మరోసారి నిరూపించుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారిని ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. వారి బాధలు విని..వీలైనంత సాయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారైనా, సమస్యల్లో ఉన్నవారైనా.. అన్నా అని వస్తే.. సత్వర న్యాయం అందించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఘటనే సోమవారం చోటుచేసుకుంది. తనను కలిసేందుకు ఓ దివ్యాంగురాలు రోడ్డుపై వేచి ఉండటం గమనించిన పవన్ కళ్యాణ్.. కారు ఆపి ఆమె బాధలు విన్నారు. ఏసీ రూముల్లో.. వీల్ ఛైర్‌లో కూర్చునే డిప్యూటీ సీఎం.. సామాన్యురాలి కోసం రోడ్డుపైనే కూర్చుని ఆమె బాధలు విన్నారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా కారణంగా పది మంది చనిపోయారు. దీంతో ఈ గ్రామంలో పర్యటించేందుకు వచ్చారు పవన్. అతిసారంతో బాధపడుతున్నవారిని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో అతిసారం అంశం మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం ఓ దివ్యాంగురాలు తెలుసుకుంది. తన కష్టాన్ని డిప్యూటీ సీఎం వద్ద మొరపెట్టుకోవాలని నిర్ణయించుకుంది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసే పరిస్థితి లేదు.
దీంతో రోడ్డుపైనే పవన్ కళ్యాణ్ కోసం నిరీక్షించింది ఆ దివ్యాంగురాలు. డిప్యూటీ సీఎం కాన్వాయి కలెక్టర్ ఆఫీసు నుంచి వెళ్తున్న సమయంలో రోడ్డు మీదకు వచ్చింది. సారూ.. నా గోడు వినడంటూ మొరపెట్టుకుంది. అదే సమయంలో కారులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ దివ్యాంగురాలని గమనించారు. వెంటనే కారును ఆపి.. కిందకు దిగారు. రోడ్డు మీద కూర్చుని ఆమె సమస్యను విన్నారు. తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పక్కనున్న మరికొందరు దివ్యాంగులు కూడా తమ సమస్యలపై పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రాలు అందించారు. వీటన్నింటినీ స్వీకరించిన పవన్.. చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ దృశ్యాలను పక్కనున్న వారు వీడియో తీయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.