ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రణాళికలు, దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న స్కిల్ సెన్సస్‌కి సహకారం అందించాలని ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర మంత్రి జయంత్ చౌధురిని కోరారు. ఢిల్లీలోని కౌశల్ భవన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ కేంద్రమంత్రి జయంత్ చౌధురి, సెక్రటరీ అతుల్ కుమార్ తివారీ, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవో వేద్ మణి తివారీలతో ఏపీ మంత్రి నారా లోకేశ్, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న స్కిల్ సెన్సస్‌పై మంత్రి లోకేశ్ స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. స్కిల్ సెన్సస్ లక్ష్యం ఏమిటి? ఎలా చేపడుతున్నారని కేంద్రమంత్రి ఆరా తీశారు. స్కిల్ సెన్సస్ పైలెట్ ప్రాజెక్టు పూర్తి కాగానే గుర్తించిన లోటుపాట్లు సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని లోకేశ్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్, స్కిల్ సెన్సస్ చేపట్టిందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లక్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, మంత్రిత్వశాఖల నుంచి ఏపీకి ఏమేం కావాలో వివరిస్తూ ఓ లేఖను మంత్రి నారా లోకేశ్ అందజేశారు.లోకేశ్ విజ్ఞప్తి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్రమంత్రులు హామీ ఇచ్చారు. ఢిల్లీ కౌశల్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ తోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో గణేశ్ కుమార్, ఈడీ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.