వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అన్న మీద బాణాలు వదులుతున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వైసీపీపైనా అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలనతో పాటుగా గత వైసీపీ పాలనను కూడా షర్మిల ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై షర్మిల.. ప్రస్తుత, గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకమని షర్మిల పేర్కొన్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమంటూ ట్వీట్ చేశారు.
నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటాలాడారని.. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వైఎస్ఆర్ తన జీవితం మొత్తం బీజేపీని వ్యతిరేకించారన్న వైఎస్ షర్మిల.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా మారారన్నారు. బీజేపీతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారని.. అలాంటి వాళ్లకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటనేనని ట్వీట్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వైసీపీ చేసేంది మహాపాపమైతే.. టీడీపీ కూటమి విద్యార్థులకు శాపం పెడుతోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని.. పథకానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడిని షర్మిల డిమాండ్ చేశారు.