వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేశారు. అయితే సార్.. అయన్నపాత్రుడు సార్ నమస్కారం సార్.. అనాల్సి వస్తుందనే సిగ్గుతోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వస్తే సీఎం చంద్రబాబు అయినా సరే.. స్పీకర్ పదవికి నమస్కారం పెట్టాల్సిందేనన్నారు అయ్యన్న. నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న అయ్యన్యపాత్రుడు.. వైఎస్ జగన్ సరదాగా ఓసారి అసెంబ్లీకి రావాలన్నారు. వస్తే ఇద్దరం కలిసి ముచ్చటించుకుందామంటూ అయ్యన్నపాత్రుడు సెటైర్లు పేల్చారు.
మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో జరిగిన పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. కోటి 40 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న అయ్యన్న.. వైఎస్ జగన్ మీద సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేసింది వైసీపీ నేతలేనన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఇవాళ ఇసుక గురించి వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లు ప్రజలను మోసం చేసి, రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గుమ్మడిగొండ, అల్లిపూడిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేసి రూ. 2 కోట్లు దోచుకున్నారన్న అయ్యన్నపాత్రుడు.. నర్సీపట్నంలో 48 వేల మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నర్సీపట్నం నియోజకవర్గానికి వంద రోజుల్లోనే రూ.40 కోట్లు తెచ్చానన్న అయ్యన్నపాత్రుడు.. నాతవరం మండలానికి సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేశామన్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాండవ గేటు మరమ్మతులకు రూ. 3 లక్షలు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను మరో 4 సంవత్సరాల 9 నెలలు ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ లోపు నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున కష్టపడి పనిచేసిన వారికే అవకాశాలు ఉంటాయని.. తాళాలు కొట్టేవారికి కాదని చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తాండవ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి.. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.