చిరుత సంచారం ఏలూరు జిల్లాను భయపెడుతోంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో చిరుత పులి సంచరిస్తోందనే వార్తలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల కిందట ఎం. నాగులపల్లి శివార్లలో చిరుత కనిపించింది. దీంతో అప్పటి నుంచి స్థానికులు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచారంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఈ ట్రాప్ కెమెరాలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. అందులో చిరుత కదలికలను గుర్తించారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను సేకరించి రాజమహేంద్రవరం ల్యాబ్‌కు పంపారు. చిరుత సంచారం నిర్ధారణ కావటంతో స్థానికులను కూడా అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు.
శనివారం రాత్రి భీమడోలు జంక్షన్ - నాగులపల్లి మార్గంలో చిరుత సంచారాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఇక అప్పటి నుంచి భీమడోలు మండలం పోలసానిపల్లి, అర్జావారిగూడెం, అంబరుపేట, ద్వారకా తిరుమల మండలం ఎం. నాగులపల్లి పరిసరాల్లో చిరుత కదలికలపై అటవీశాఖ అధికారులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఈ కెమెరాల్లో చిరుత కనిపించడం స్థానికులను మరింత భయపెడుతోంది.
మరోవైపు చిత్తూరు జిల్లాను కూడా చిరుత పులి సంచారం భయపెడుతోంది. చౌడేపల్లి మండలంలో చిరుత సంచరిస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీంతో గ్రామస్థులు ఆందోళనకు గురౌతున్నారు. చౌడేపల్లి మండలంలో కొన్నిచోట్ల పెద్ద పెద్ద అడుగులతో పాటు పక్కనే చిన్న చిన్న అడుగులను స్థానికులు గుర్తించారు. ఈ పాదముద్రలు చిరుత, దాని పిల్లవని అనుమానిస్తున్నారు. దీంతో మరింతగా వణికిపోతున్నారు. అయితే చిరుత కదలికలపై అటవీశాఖ అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
మరోవైపు చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. అయితే రైతులు పొలానికి అమర్చిన కరెంట్ వైర్ల కారణంగా షాక్ తగిలి ఈ చిరుత చనిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుత పంజా గోళ్లు సైతం ఎవరో కత్తరించుకెళ్లటంతో ఇదేమైనా వేటగాళ్ల పనా అనే కోణంలోనూ అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.