ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలకే కాదు.. దేశంలో రాజకీయాలంటే కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైనం.. గతంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర.. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటుంది. చంద్రబాబును ఇన్నేళ్లుగా రాజకీయాల్లో చూస్తున్న వారికి.. పాత చంద్రబాబుకు, ప్రస్తుత చంద్రబాబుకు తేడా తెలుస్తూనే ఉంటుంది. భావోద్వేగాలకు అతీతంగా, పనే ప్రథమ కర్తవ్యంగా అధికారులను ఉరుకులు పరుగులు తీయించిన ఒకప్పటి చంద్రబాబుకు.. నేటి సీఎం చంద్రబాబుకు తేడా ఉంది. పనిలో వేగం తగ్గకపోయినా.. చంద్రబాబు పనితీరులో, అధికారులకు ఇచ్చే ప్రాధాన్యంలో మార్పు వచ్చింది. దానిని తెలియజేసే ఘటన తాజాగా జరిగింది.
అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు ఈ డ్రోన్ షో ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ డ్రోన్ షో జరగనుంది. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అయితే దీపాలు వెలిగించే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. చంద్రబాబు బూట్లు వేసుకున్న సంగతిని మర్చిపోయి.. దీపాన్ని వెలిగించబోయారు. అయితే వెంటనే అక్కడ ఉన్న ఓ అధికారి సీఎం చంద్రబాబుకు ఈ విషయాన్ని దగ్గరకు వచ్చి చెప్పారు. దీంతో వెంటనే పొరబాటును గ్రహించిన చంద్రబాబు.. వెనక్కి వెళ్లి బూట్లు వదిలేసి వచ్చి దీపాలను వెలిగించారు. ఆ తర్వాత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజనం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక సీఎం స్థాయి వ్యక్తి వద్దకు వెళ్లి ఏదైనా చెప్పాలంటే అధికారులు.. ముందు ఒకటికు రెండు సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే వారు ఎలా రియాక్టవుతారో అనే భయం వారిలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరబాటు జరుగుతున్న విషయాన్ని గమనించినా.. వెళ్లి చెప్తే ఏమంటారో అనే భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ అధికారి మాత్రం నేరుగా సీఎం వద్దకు వెళ్లి పొరబాటు గురించి ఆయనకు చెప్పారు. చంద్రబాబుకు కూడా జరగబోయే పొరబాటును గుర్తించి.. అధికారి మాటలు విని వెంటనే తప్పు జరగకుండా జాగ్రత్తపడ్డారు.
ఇక అధికారుల మాటలకు సీఎం ఎంత ప్రాధాన్యమిస్తారనేదీ.. ఆ అధికారి ఎలాంటి భయం లేకుండా నేరుగా చంద్రబాబుకు వెళ్లి చెప్పడంతోనే అర్థమవుతోందని నెటిజనం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు కూడా అధికారి మాటలు వినడాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబులో మార్పు వచ్చిందని.. గతంలో మాదిరిగా కాకుండా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా పాదాభివందనం చేయడానికి వస్తే తిరిగి వాళ్లు కాళ్లు మొక్కడం దగ్గర నుంచి అధికారులతో ఫ్రెండ్లీగా ఉండటం వరకూ అంతా కొత్తగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.