రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో ఈ నాలుగు నెలలుగా బాలికలు, మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకండా పోయిందని, వారు తీవ్ర భయాందోళనల మధ్య బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల తెలిపారు. న్యాయం చేయాల్సిన సీఎం చంద్రబాబు, పంచాయితీలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందని, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం, పలు కేసుల్లో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి, వేధించడానికి ఉపయోగిస్తున్నారని ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కూటమి 120 రోజుల పాలనలో మహిళలపై 74 అఘాయిత్యాలు జరిగాయని, అత్యాచారం చేసి 6గురు మహిళలను చంపారని, 200 మందిపై దాడులు జరిగాయని గుర్తు చేసిన శ్యామల, ఇప్పుడు దిశ యాప్ ఉండి ఉంటే, ఇన్ని ఘోరాలు జరిగి ఉండేవి కావని స్పష్టం చేశారు.దిశ యాప్ వల్ల 31,600 మంది ప్రమాదాల నుంచి రక్షించబడ్డారన్న ఆమె, కేవలం జగన్‌గారికి మంచి పేరు వస్తుందనే ఆ యాప్ నిర్వీర్యం చేశారని అన్నారు. ‘నాడు విపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్, అనిత ఇదే దిశ ప్రతులను తగలబెట్టి, భవిష్యత్తులో తాము దాన్ని నిర్వీర్యం చేయబోతున్నాం’.. అని చెప్పారంటూ.. శ్యామల ఆ ఫోటోలు ప్రదర్శించారు. మహిళల రక్షణ ప్రభుత్వానికి చేతకాకపోతే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దిశ చట్టాన్ని ఆమోదింపచేసి, చట్టాన్ని అమలు చేయాలని, దిశయాప్‌ను పునరుద్ధరించాలని కోరారు. 19 జాతీయ అవార్డులు తెచ్చుకున్న దిశ యాప్‌పై తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోగా, మరోవైపు డయేరియాతో ప్రజలు చనిపోయే దుస్థితి ఏర్పడిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గుర్తు చేశారు. ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని, మరోవైపు కాల్‌మనీ కాలకేయులు, ఇసుక, లిక్కర్ మాఫియాలు రెచ్చిపోతున్నాయని, మహిళలపై దాడులు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని ఆక్షేపించారు. బద్వేలులో ప్రేమించలేదని విగ్నేశ్ అనే యువకుడు అమ్మాయిపై పెట్రోల్ పోసి కాల్చి చంపేడని, హిందూపూర్‌లో అత్తాకోడళ్ల మీద అత్యాచారం జరిగితే, కనీసం పరామర్శించి అండగా ఉంటామని చెప్పే తీరిక స్థానిక ఎమ్మెల్యేకు లేదని గుర్తు చేశారు.
తెనాలిలో యువతి మీద దాడి చేసిన నిందితుడు ఎవరి అనుచరుడో అందరికీ తెలుసని చెప్పారు. పిఠాపురంలో యువతి మీద దుర్గాడ జానీ అనే టీడీపీ నాయకుడు అత్యాచారం చేస్తే దళిత యువతి అనే కారణంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేదని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా, ఇన్ని ఘటనలు జరుగుతున్నా, కనీసం నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఇల్లు, పెన్షన్ ఇస్తామని ఆశ చూపిన ఒక మంత్రి అనుచరుడు ఖాదర్ భాషా.. మహిళలను లొంగదీసుకుంటున్నా.. ఏ చర్యా తీసుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.