ఏలూరు జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. గత నెల రాజమహేంద్రవరం వద్ద కనిపించిన చిరుత, ప్రస్తుతం ద్వారకాతిరుమల ఎం.నాగులపల్లి శివారులో సంచరిస్తున్న చిరుత రెండూ ఒక్కటేనని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటివరకూ మనుషులపై ఎలాంటి దాడీ చేయలేదని, కుక్కలను మాత్రమే చంపి తింటోందని అధికారులు చెబుతున్నారు. చిరుత కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలు, బోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాజాగా ఎం.నాగులపల్లి శివారు చెరుకు తోటల్లో చిరుత కాలిముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అవి చిరుతవేనని రాజమహేంద్రవరం ల్యాబ్ అధికారులు నిర్ధరించారని వెల్లడించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.