వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి ఆమె భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు హాజరయ్యారు.అంతేకాకుండా ప్రియాంక వెంట ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు అగ్రనేతలు కూడా హాజరయ్యారు. స్థానిక నేతల సమక్షంలో ప్రియాంక గాంధీ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు వయనాడ్ కల్పేటలో మెగా రోడ్‌షో నిర్వహించారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు.. రెండు సీట్లలో గెలుపొందడంతో రాహుల్ వాయనాడ్ సీటును వదులుకున్నారు. వయనాడ్ సీటు ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే..రోడ్ షో అనంతరం ఓ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. తొలిసారిగా తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. తన సోదరుడు రాహుల్ గాంధీ విద్వేషానికి వ్యతిరేకంగా ప్రయాణించాడని.. వాయనాడ్ అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చినందుకు యూడీఎఫ్, కాంగ్రెస్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రతి సందర్భంంలోనూ తాను వాయనాడ్‌కు అండగా ఉంటానన్నారు. ఈ సరి కొత్త ప్రయాణంలో ప్రజలే తనకు మార్గదర్శకమన్నారు. తనకు 17 సంవత్సరాల వయస్సు నుంచి.. దాదాపు 35 సంవత్సరాలుగా వివిధ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నానని.. ఇంతకాలం తన తల్లి, సోదరుడు, తన పార్టీ కార్యకర్తల కోసం ప్రచారం చేశానని.. ఇప్పుడు స్వయంగా ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారంటూ ప్రియాంక పేర్కొన్నారు. అవకాశం ఇస్తే వయనాడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తానని వివరించారు.