ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకువస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో ఆలోచన చేస్తోంది. కేంద్రం నుంచి పలు అంశాలలో పూర్తి సహకారం అందుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని పూర్తిగా వినియోగించుకునేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఏపీ సర్కారు ఆలోచన చేస్తోంది. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకం తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ వాడేవారికి రాయితీలిస్తున్నాయి. 3 కిలోవాట్లకు రూ.78 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుండగా.. మిగితా మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఇది కూడా లేకుండా ఉచితంగా అందివ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఈ క్రమంలో డిస్కంల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఒక్కో డిస్కంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు.. వారిలో సోలార్ విద్యుత్ మీద ఎంతమందికి ఆసక్తి ఉందనే దానిపై సర్వే జరుగుతోంది. ఈపీడీఎసీఎల్ పరిధిలో ఇలాంటి సర్వే ఇప్పటికే మొదలైంది కూడా. ఆయా డిస్కంల పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కుటుంబాలను సోలార్ విద్యుత్ వాడకంపై వివరాలు సేకరిస్తారు. అయితే ఇక్కడే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సౌరఫలకలను ఇంటిపై అమర్చా్ల్సి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలా సౌరఫలకాలు ఏర్పాటు చేసేందుకు ఇళ్లు ఎంతమేరకు అందుబాటులో ఉంటాయనేదీ అనుమానమే.
మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. దీనికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. అలా కాకుండా వీరందరినీ సోలార్ విద్యుత్ వైపు మళ్లిస్తే.. మొదట్లో కొంచెం ఎక్కువగా ఖర్చైనప్పటికీ.. దీర్ఘకాలంలో ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇళ్ల అవసరాలకు పోనూ మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించేందుకు వీలుంది. ఇక ఒకసారి ఈ సౌరఫలకలు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీలకు సౌర విద్యుత్ ఉచితంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.