వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. 'పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు గుడ్ బుక్ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది గుడ్ బుక్ కాదు గుండెబుక్. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు , ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు గుడ్‌బుక్ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారు' అంటూ లేఖలో ప్రస్తావించారు.
'పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశాను. ప్రజాతీర్చు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మథనం చెంది వైఎస్సార్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను' అంటూ లేఖ రాశారు.
తనకు వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడి పనిచేస్తే.. వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందని.. ఆ అంశాలపై త్వరలోనే మాట్లాడతానంటున్నారు పద్మ.రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకోకుండా జగన్‌మోహన్ రెడ్డి పార్టీని నడపటం రాష్ట్రానికి ప్రమాదమన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా మహిళలపై నేరాలు, ఘోరాలు జరుగుతాయని.. ఇలాంటి అంశాల విషయాల్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే బావుంటుందన్నారు. కానీ తమ ప్రభుత్వం మహిళలకు స్వర్ణయుగం అని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారని.. ఎన్ని ఘటనల్లో వైఎస్ జగన్, ఆ రోజు హోంమంత్రి బాధిత కుటుంబాల్ని పరామర్శించారో చెప్పాలన్నారు.
మహిళలకు అన్యాయం జరిగితే రాజకీయం చేయడం కోసం వెళ్లడం సరికాదన్నరు వాసిరెడ్డి పద్మ. మహిళలకు సంబంధించిన వైఫల్యాలు ఉంటే కచ్చితంగా మాట్లాడాలని.. నిందితుల్ని వెనుకేసుకొచ్చే కాపాడే ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వాన్ని పోరాడాల్సిందే, నిలదీయాల్సిందే అన్నారు. కానీ ఘటన జరిగిన వెంటనే దాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. మహిళల్ని కూడా రాజకీయాలకు అడ్డంపెట్టుకునే వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. మహిళల్ని రాజకీయాలకు వాడుకోవం మంచి సంప్రదాయం కాదని.. 'మన హయాంలో ఏమీ జరగలేదు.. ఇప్పుడున్న ప్రభుత్వంలోనే అఘాయిత్యలు జరుగుతున్నాయనడం సరికాదు' అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తుంటారనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
జగన్‌కు వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే అవసరం లేదనుకుంటున్నారని వ్యాఖ్యానించారు పద్మ. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకోవాల్సింది పోయి.. పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పదే, పదే ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు వేశానని మాత్రమే జగన్ చెప్పారని.. పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మద్యం ద్వారా వారి రక్తాలను పీల్చాలని ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానుఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని.. ఎవరినీ సంప్రదించలేదన్నారు.
జగన్‌ను వ్యతిరేకించాలనే లక్ష్యం తప్ప ఏమీ లేదన్నారు పద్మ. ప్రజలతో ఉంటాను.. రాజకీయాల్లో కొనసాగుతానని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. రాజకీయ ముసుగులో జరిగే అన్యాయాలపై మాట్లాడతానని.. రాజకీయాల్లో ధైర్యం ఉండాలన్నారు. పార్టీలు ఊరికే మనిషిని కాదని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు జరిగినా, అన్యాయం జరిగినా.. పార్టీల మారడం మంచిది కాదని అన్నీ భరించి ఉన్నానన్నారు. కానీ నాయకుడి మీద నమ్మకం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు.