పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్ర చందనం దుంగలు తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడకుండా హీరో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు బయట కూడా బయటపడుతున్నాయి. పాల ట్యాంకర్లు, నీళ్ల ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లలో డ్రగ్స్, గంజాయి సహా ఇతర నిషేధిత వస్తువులు తరలిస్తూ.. అడ్డంగా దొరికిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ ట్యాంకర్‌లో మద్యం బాటిళ్లు తరలిస్తూ.. ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఆ ఆయిల్ ట్యాంకర్‌ను పట్టుకున్న పోలీసులు.. అందులో ఉన్న మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఈ సంఘటన మద్య నిషేధం ఉన్న బీహార్ రాష్ట్రంలో జరిగింది.
బీహార్‌లో ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తుండగా.. కొందరు వ్యక్తులు బయటి నుంచి మద్యం అక్రమంగా రవాణా చేయడం, కల్తీ మద్యం తయారు చేయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలిస్తున్నారని బీహార్ ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ పోలీసులు.. ముజఫర్‌పూర్ జిల్లాలో ఆ ఆయిల్ ట్యాంకర్‌ను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయిల్ ట్యాంకర్‌ను పట్టుకునేందుకు రోడ్డుపై బారికేట్లు ఏర్పాటు చేశారు.
అయితే పోలీసులు పెట్టిన బారికేడ్లను గమనించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్.. దాన్ని దారి మళ్లించి.. హైవేపైకి ఎక్కించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన ఎక్సైజ్ పోలీసులు.. తమ వాహనంలో వెళ్లి ఆ ఆయిల్ ట్యాంకర్‌ను వెంబడించారు. దీంతో భయంతో వణికిపోయిన డ్రైవర్, మద్యం వ్యాపారి.. ఆ ఆయిల్ ట్యాంకర్‌ను నడిరోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆ ఆయిల్ ట్యాంకర్‌ను తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అందులో దాచి తరలిస్తున్న 200 కార్టన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ మద్యం బాటిళ్లను అరుణాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు.. ఆ ఆయిల్ ట్యాంకర్ నాగాలాండ్‌లో రిజిస్టర్ అయినట్లు.. నంబర్ ప్లేట్ ఆధారంగా తేల్చారు.
కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.. ఆ మద్యం వ్యాపారిని గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి మద్యం బాటిళ్లను బయటికి తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉండగా.. కల్తీ మద్యం ఏరులైపారుతోంది. దీంతో కల్తీ మద్యం తాగి.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం బీహార్‌లో జన్‌సురాజ్ పార్టీని పెట్టిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువస్తే.. కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రకటించారు.