డబ్బుల విషయంలో ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు.. చివరికి చంపుకునే వరకు వెళ్లిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. ఇక ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు.. ప్రజల దగ్గరి నుంచి అక్రమంగా డబ్బులు తీసుకోవడం నేరం. అలా తీసుకుంటే బాధితులు.. వినియోగదారుల కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి ఘటనల్లో వినియోగదారుల కోర్టు విచారణ జరిపి.. ఒకవేళ బాధితుల సొమ్ము అక్రమంగా తీసుకుంటే భారీగా ఫైన్లు వేసిన ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాగే ఓ వ్యక్తి నుంచి 50 పైసలు ఎక్కువగా తీసుకున్నట్లు తేలడంతో పోస్టాఫీస్‌కు.. వినియోగదారుల కోర్టు రూ.15 వేలు ఫైన్ విధించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
చెన్నైలోని గెరుగాంబకంకు చెందిన మనాషా అనే వ్యక్తి.. పొలిచాలూర్ పోస్టాఫీస్‌కు గతేడాది డిసెంబర్ 3వ తేదీన వెళ్లాడు. రిజిస్టర్డ్ లెటర్‌ను పంపించేందుకు వెళ్లిన మనాషా.. లెటర్ పంపించగా.. అందుకు రూ.29.50 అయినట్లు పోస్టాఫీస్ సిబ్బంది తెలిపారు. అయితే పోస్టాఫీస్ కౌంటర్‌లో మనాషా రూ.30 చెల్లించాడు. అయితే తిరిగి తనకు రావాల్సిన 50 పైసలను అడిగాడు. అయితే కంప్యూటర్ రూ.29.50 కాస్తా.. రూ.30గా తీసుకుందని పోస్టాఫీస్ సిబ్బంది తెలిపారు. దీంతో తాను యూపీఐ ద్వారా కచ్చితమైన రూ.29.50 చెల్లిస్తానని చెప్పగా.. అందుకు సర్వర్ బిజీగా ఉందని చెప్పి పోస్టాఫీస్ సిబ్బంది డబ్బులే తీసుకున్నారు.
అయితే ఈ విషయాన్ని జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోస్టాఫీస్ సిబ్బంది ఇలా.. చిల్లర డబ్బులు వెనక్కి ఇవ్వకుండా స్వాహా చేస్తోందని ఆరోపించాడు. అంతేకాకుండా జీఎస్టీ రాబడిపైనా ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిపాడు. 50 పైసలకు అటూ ఇటూగా ఉంటే దగ్గరగా ఉన్న రూపాయిని లెక్కించేలా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ చేయబడిందని పోస్టాఫీస్ సిబ్బంది వివరించారు.
యూపీఐ చెల్లింపులు జరగకపోవడంతో "Pay U" క్యూఆర్ డిజిటల్ చెల్లింపు పద్దతి ద్వారా చెల్లించాలని సూచించారు. అయితే అది 2023 నవంబర్ నుంచి సరిగా పని చేయకపోవడంతో ఈ ఏడాది మే నెలలో నిలిపివేసినట్లు తెలిపింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత.. పోస్టాఫీస్ సిబ్బంది.. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా వినియోగదారుడి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించింది. ఇది వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 2(47) ప్రకారం.. అన్యాయం అని తెలిపింది. దీంతో అతడికి రావాల్సిన 50 పైసలపై.. 29.99 లక్షల శాతం అధిక జరిమానాను విధించింది. 50 పైసలకు 29.99 లక్షల శాతం అంటే రూ.15వేలు మనషాకు చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.