బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశంలోని సామాన్యులు.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను భరించలేక అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ బ్రాండ్ పేరుతో బియ్యం, గోధుమ పిండిని తక్కువ ధరకే మోదీ సర్కార్.. సామాన్యులకు ఇప్పటికే అందిస్తోంది. భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరలకే బియ్యం, గోధుమ పిండిని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భారత్ బ్రాండ్ కింద.. పప్పులను కూడా మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే అందించి.. పెరిగిన నిత్యావసర ధరల భారం నుంచి సామాన్యులకు ఊరట కల్పించాలని భావిస్తోంది.
ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద బియ్యం, గోధుమ పిండిని రాయితీ ధరలకు అందిస్తున్న కేంద్రం తాజాగా దాన్ని మరింత విస్తరించింది. ఇందులో తృణధాన్యాలు, మసూర్ దాల్‌ని కేంద్రం చేర్చింది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించే ప్రయత్నంలో భాగంగా రిటైల్‌లో వీటిని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే భారత్ బ్రాండ్ రెండో దశను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. దేశంలోని కో ఆపరేటివ్ నెట్‌వర్క్స్, ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా తక్కువ ధరలకే పప్పులను విక్రయించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ఇందులో శనగ పప్పు కిలోకు రూ.58, ఎర్ర కందిపప్పు కిలోకు రూ.89కు రిటైల్‌లో విక్రయించనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. బఫర్ స్టాక్ నుంచి సబ్సిడీ ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ భారత్ బ్రాండ్ కింద సామాన్యులకు విక్రయించేందుకు సహకార సంఘాలకు 3 లక్షల టన్నుల శనగ పప్పు, 68 వేల టన్నుల ఎర్ర కందిపప్పును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ భారత్ బ్రాండ్ కింద శనగ పప్పు, ఎర్ర కందిపప్పును మొదట ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పంపిణీ ప్రారంభిస్తామని ఎన్‌సీసీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ చంద్ర జోసెఫ్ వెల్లడించారు. ఈ పథకం కింద భారత్ బ్రాండ్ ఉత్పత్తులను 10 రోజుల్లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విక్రయించాలనే ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. శనగపప్పుకు ప్రస్తుతం మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉన్నందున సబ్సిడీ కింద సామాన్యులకు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్‌లతో.. ప్రజలకు విక్రయాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
భారత్ బ్రాండ్ తొలి దశను గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. బియ్యం, గోధుమ పిండితో పాటు పప్పులను ప్రభుత్వం రిటైల్ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి దశలో భారత్ బ్రాండ్ గోధుమ పిండి కిలోకు రూ.30, బియ్యం రూ.70, పప్పులను రూ.93కే విక్రయించింది. అదే సమయంలో మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కిలో ఉల్లి రూ.35, టమాట రూ.65కే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది పప్పుధాన్యాల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.