వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత, వైఎస్ జగన్.. ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై గత నెలలో వైఎస్ జగన్‌కు.. వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ ఉదయమే ప్రకటించిన టీడీపీ.. పది అంశాలతో వైఎస్ షర్మిల రాసినట్లుగా చెప్తున్న లేఖను.. అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు ఆ లేఖలో ఏముందంటే..
"డియర్ జగన్ అన్నా. మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. దివంగతులైన మన నాన్నగారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్పిన విషయం మీకు గుర్తుచేస్తున్నా. ఈ షరతుకి అంగీకరిస్తున్నానని అప్పట్లో మీరు మాకు హామీ ఇచ్చారు. అయితే నాన్న మరణం తర్వాత దానికి ఒప్పుకోనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్, సాక్షితో పాటు నాన్న తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులను నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా ఇవ్వాలని చెప్పారు. వీటన్నింటికీ అమ్మే సాక్షి. అయితే నాకు బదిలీ చేసినట్లుగా చేసుకున్న ఒప్పందంలో చెప్పిన ఆస్తులు, నాన్న ఆదేశాలను పాక్షికంగా పాటించడమే. పాక్షికంగా అని ఎందుకంటున్నానంటే సాక్షి, భారతీ సిమెంట్స్‌లో మెజారిటీ వాటాను మీరు కోరుతున్నారు."
"ఇప్పటి వరకూ మీదే పైచేయి అయ్యింది.అలాగే మీరు నా అన్న కావున.. కుటుంబ గొడవలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో సమాన వాటాను వదులుకోవడానికి నేను అంగీకరించా. 2019 ఆగస్ట్ 31న చేసుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని ఆస్తులు మాత్రమే నాకు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు అమ్మ మీద కూడా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం సొంత చెల్లెలికి, వారి పిల్లలకు రావాల్సిన ఆస్తులను కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. నాన్న ఆదేశాలను, ఆయన నడిచిన మార్గాన్ని తప్పుతున్నారు. ఇప్పుడేమో ఏకంగా నాన్న గారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒప్పందాన్ని రద్దు చేయాలంటున్నారు. చట్టప్రకారం మీ లేఖ చెల్లదు. కానీ ఈ లేఖ వెనుక ఈ మీ దుర్బుద్ధి తెలిసి బాధకలుగుతోంది. చట్టప్రకారం కుటుంబసభ్యులకు చెందాల్సిన ఆస్తులను కూడా లాక్కోవాలని వారిపై కేసులు పెట్టి.. నాన్న కలలోనైనా ఊహించని పనిచేశారు."
"ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే సరస్వతి పవర్ షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. అమ్మ.. భారతి సిమెంట్, సండూర్‌లకు చెందిన షేర్లు పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత ఇలా ఫిర్యాదు చేయడం సరి కాదు. మీరు అమ్మకు సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌ల మీద సంతకాలు చేశారు. ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి, కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్‌లో నాకు వాటాలు లేకుండా చేయాలనేదే మీ ఉద్దేశం. చట్టప్రకారం దాని మీద నాకు పూర్తి అర్హత వుంది. ఒప్పందం ప్రకారం కాకుండా మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధం. 20 ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా, ఒప్పందంలో పేర్కొన్న అన్ని ఆస్తులకు సంబంధించి చేసుకున్న ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా."
"రాజకీయ జీవితం పూర్తిగా నా వ్యక్తిగతం. నా వృత్తిపరమైన జీవితాన్ని నిర్దేశించడానికి మిమ్మల్ని అనుమతించను. బహిరంగంగా మీకు, అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతొ మీరు సంతకం చేయుంచుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది అసమంజసం. నాన్నగారు తన ఆస్తులలో మనవళ్లు, మనవరాళ్లకు సమాన వాటా ఉండాలని కోరుకున్నారు. వాటిపై రాజకీయ ప్రభావాలు ఉండకూడదు. అన్నగా మీరు ఇష్టంతో సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత. కానీ నాన్న కోరికలను నెరవేర్చడానికి, అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు. మీరు దాని నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నా. అలా కాదని నిర్ణయించుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్ళడానికి నాకు పూర్తి హక్కులు వున్నాయి". అంటూ వైఎస్ షర్మిల లేఖ రాసినట్లు టీడీపీ లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.