తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ ట్రస్ట్ దాతలకు కేటాయించే టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రేపు (గురువారం) విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యం కోసమే కాకుండా వివిధ సేవా కార్యక్రమాల కోసం టీటీడీ అనేక ట్రస్టులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రాణదాన ట్రస్టు, అన్నదాన ట్రస్టు ఇలా వివిధ ట్రస్టులు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులతో పాటుగా, పథకాలకు, శ్రీవెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి దాతలు విరాళాలు అందిస్తుంటారు. పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పలువురు ప్రముఖుల వరకూ విరాళాలు అందిస్తూ ఉంటారు. అయితే ఇలా విరాళాలు అందించే దాతలకు టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులను కేటాయిస్తూ ఉంటుంది. దీనికోసం ప్రతి నెలా ప్రత్యేకంగా కోటా కేటాయిస్తారు.
ఈ క్రమంలోనే 2025 జనవరి నెలకు సంబంధించిన టీటీడీ ట్రస్టు దాతల దర్శనాలు, వసతి గదుల కోటాను అక్టోబరు 24వ తేది ఉదయం 11.30 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దాతలు ఈ విషయాన్ని గమనించి.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనతో సూచించింది. మరోవైపు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం (అక్టోబర్ 23) ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేసింది.రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి 19 వరకూ టికెట్ల విడుదల వాయిదా వేసింది.
మరోవైపు తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు బుధవారం సందర్శించారు. ఆంజనేయస్వామి ఆలయం, కళ్యాణకట్ట, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయశాల,లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పుష్కరిణి, క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగర బత్తుల విక్రయ కేంద్రాన్ని పరిశీలించారు. పారిశుద్ధ నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం.. కార్తీక మాసం రానున్న నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.