రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వయనాడ్‌లో ర్యాలీ, రోడ్ షో నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశంలో ఏ పార్లమెంటు నియోజకవర్గానికి అయినా ఒకరే ఎంపీ ఉంటారని.. కానీ వయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని పేర్కొన్నారు. ఈ వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను గెలిపిస్తే ఆమె అధికారికంగా ఎంపీగా ఉంటారని.. అదే సమయంలో తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ ఇవాళ నామినేషన్ వేయగా.. ఈ కార్యక్రమం కోసం మంగళవారం రాత్రే ఆమెతో కలిసి రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం వయనాడ్ నియోజకవర్గంలోని కల్పెట్టలో ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో ఏ నియోజకవర్గానికైనా ఒకరే ఎంపీ ఉంటారని.. కానీ వయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రియాంకా గాంధీ అధికారికంగా ఎంపీగా కొనసాగితే.. గతంలో వయనాడ్ ఎంపీగా ఉన్నా తాను అనధికారికంగా ఎంపీగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇద్దరం కలిసి వయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఇక ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు భారీగా తరలివచ్చారు. ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఇక గత 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న ప్రియాంక గాంధీ వాద్రా.. తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించగా.. ఆయన వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటే వయనాడ్ ఉపఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23వ తేదీన ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.