వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జగన్, షర్మిల ఆస్తి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన ప్రస్తుతం లక్షల కోట్లకు చేరుకుందని.. అదంతా ఎలా వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కనీస విలువలు పాటించని ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందన్నారు.
తల్లి, సోదరిని కోర్టుకీడ్చిన జగన్.. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. "విలువలు లేని మనుషులు సమాజానికి చేటు. ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఎన్నడైనా సాయం చేశారా. ఇప్పుడేమో వైసీపీ తరఫున రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. జగన్ దగ్గర ఉన్న అవినీతి సొమ్ము అలాగైనా పేదలకు చేరుతుంది. ప్రతిపక్షంలో ఉండగా.. నన్ను 5 ఏళ్లపాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ఇప్పుడు వారిని ఆపాలంటే నిమిషం కాదు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీద కుదరదు" అని బాబు స్పష్టం చేశారు.