అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతోంది. అమెరికాలోని ఆస్ట్రిన్, డల్లాస్ నగరాల్లో మంత్రి బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో నిమగ్నమయ్యారు లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ టూర్ కొనసాగుతోంది. టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు. ఈవీ రంగానికి అనంతపురం అనుకూలమైన ప్రదేశం పెట్టుబడులు పెట్టండి అంటూ టెస్లా కంపెనీని కోరారు. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని చెప్పారు.
దీనిపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా సానుకూలంగా స్పందించారు. అలాగే రాస్ పెరోట్ జూనియర్‌తో ఏపీ మంత్రి భేటీ అయ్యారు. ఆపై డల్లాస్‌లో పెరోట్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కాగా.. టెస్లా కేంద్ర కార్యాలయ సందర్శన కోసం లోకేష్ ఆస్టిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేషల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే కృషి కొనసాగుతుందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానం వల్ల ఏపీకి రావడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని లోకేష్ వెల్లడించారు.