తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా గాడిద పాల బిజినెస్ గురించి చర్చ జరుగుతోంది. మార్కెట్‌లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆ దిశగా అడుగులువేశారు.. ఏపీ, తెలంగాణలో చాలామంది గాడిద పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో వందలాదిమందిని బురిడీ కొట్టించాడు. గాడిద పాలతో కోట్లు సంపాదించొచ్చని చెప్పి మాయ మాటలు చెప్పి ఏకంగా రూ.కోట్లలో మోసం చేశాడు. గాడిద పాలతో భారీ లాభాలు వస్తాయని, కాస్మొటిక్స్, ఫేస్‌క్రీమ్ కోసం వాడతారని చెప్పడంతో నిజమని నమ్మి నిండా మునిగారు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్‌లో ఓ వ్యక్తి గాడిదల ఫామ్ మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా తన ఫామ్ దగ్గర యూ ట్యూబ్‌లో వీడియోలు తీస్తూ.. లీటరు గాడిద పాలను రూ.1600 నుంచి రూ.1800కు కొనుగోలు చేస్తానని కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టాడు. తనకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని.. కానీ తాను వారి డిమాండ్‌కు తగినన్ని పాలను సప్లై చేయలేకపోతున్నట్లు చెప్పాడు. గాడిద పాలను ఎవరైనా తనకు సప్లై చేస్తే తీసుకుంటానని.. నెలకు రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని నమ్మబలికాడు. మనోడి యూ ట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలామంది నిజమని నమ్మారు.
యూ ట్యూబ్ వీడియోలు చూసిన కొందరికి ఫోన్లు చేసి తన దగ్గర మేలుజాతీ గాడిదలు ఉన్నాయని చెప్పాడు. గాడిద పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా గతేడాది విల్లుపురంలో డాంకీ సెమినార్లు కూడా నిర్వహించారు.. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిజమని నమ్మారు. ఇలా పలువురి నుంచి ఒక్కో గాడిదకు కనీస ధర రూ.90 వేలు, మేలు రకమైతే రూ.లక్షన్నర వరకూ వసూలు చేసి అందరికి విక్రయించాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని వారికి చెప్పాడు.. ఈ పాలను సేకరించేందుకు 24 గంటలకు పైగా పడుతుందన్నాడు. ఈ పాలను నిల్వ ఉంచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు కొనాలని వారితో చెప్పాడు. వీటి కోసం రూ.75వేల నుంచి రూ. లక్షన్నర వరకూ వసూలు చేశాడు. తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు.
మనోడి దగ్గర నుంచి కొందరు గాడిదలను కొనుగోలు చేసి.. గడ్డి పెంచేందుకని ఏకంగా పొలాలు కౌలుకు తీసుకున్నారు. షెడ్లు నిర్మించి నెల జీతాలిచ్చి పనిచేసేందుకు మనుషుల్ని నియమించుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పదుల సంఖ్యలో తమిళనాడు వ్యక్తి దగ్గర గాడిదల్ని కొనుగోలు చేసి వ్యాపారం మొదలుపెట్టారు. ప్రారంభంలో 10, 25 లీటర్ల పాలను కొనుగోలు చేసి లీటరుకు రూ.1600 నుంచి రూ.1800 చెల్లించాడు. దీంతో అలా మెల్లిగా ఏపీ నుంచి తెలంగాణ వైపునకు కూడా ఈ గాడిదల వ్యాపారాన్ని విస్తరించాడు. ఇంకేముంది ఫ్రాంచైజీలు ఇస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.ఐదు లక్షలు చొప్పును వసూలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ధనికుల పిల్లలు ఫ్రాంచైజీలు తీసుకున్నారు.
ఈ గాడిదల ఫామ్‌లలో పాలను సేకరించిన తమిళనాడు వ్యక్తి.. తనకు పైనుంచి బిల్లులు రాలేదంటూ అందరికి డబ్బుల్ని పెండింగ్ పెట్టాడు. ఇటు గాడిదల ఫాంలలో పాల నిల్వలు పెరిగి పోవడంతో ఫ్రాంచైజీలు తీసుకున్నవారు ఫోన్లు చేస్తున్నా స్పందించలేదు. కొంతమంది కొత్త నంబర్ల నుంచి కాల్ చేస్తే.. తాను నష్టపోయానని.. తనతో అగ్రిమెంట్ చేసుకున్న ఫార్మా పరిశ్రమ పాలను కొనుగోలు చేయడం లేదన్నాడు. దీంతో మోసపోయామని ఫ్రాంఛైజీలు తీసుకున్నవారు తెలుసుకున్నారు. ఫాంలలో గాడిదలను మేపలేక, అక్కడ పనిచేసేవారికి జీతాలు ఇవ్వలేక వాటిని రోడ్డుపైకి వదిలేశారు. అక్కడ భారీ ఫ్రీజర్లకు కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక వందల లీటర్ల గాడిద పాలను పారబోశారు.
కొంతమంది బాధితులు పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి కొందరు ఏం మాట్లాడటం లేదు. ఏపీలో ఇప్పటి వరకూ 46 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. వారంత రూ.కోట్లలో నష్టపోయినట్లు సమాచారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ తమిళనాడు వ్యక్తి మళ్లీ గాడిదలు, పాలు, ఫ్రాంఛైజీల పేరుతో మరికొందరిక పాథ కథ చెప్పి డబ్బులు అడగుతున్నట్లు తెలుస్తోంది.