బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఒడిసాతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది.దీని ప్రభావంవల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈరోజు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి, మన్యం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.ఒడిసాలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో నిన్న తేలికపాటి వానలు పడ్డాయి. రాబోయే 24 గంటల వ్యవధితో రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయిన తెలిపారు. డిసెంబరు నెలలో ఏర్పడబోతున్న తుపాన్లలో 70 శాతం తుపాన్లు తీవ్ర తుపాన్లుగా బలపడతాయంటున్నారు. డిసెంబరు నెలలో గరిష్ట సంఖ్యలో ఏర్పడే తుపాన్లు పుదుచ్చేరి, తమిళనాడు వద్దతీరాలు దాటుతాయంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం ఇలా కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రంలో విచిత్రకరమైన వాతావరణం నెలకొంది. కార్తీకమాసం దగ్గరపడుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడంలేదు. వేసవికాలంలో ఉండే ఎండల్లా ఇవి మండిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీల చొప్పున పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నెల్లూరు జిల్లా కావలిలో నమోదైంది. మరికొన్ని రోజులపాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, తూర్పుగాలులు ప్రారంభమైన తర్వాత తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. వర్షాలు భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంటే అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరేట్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.