గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భూకబ్జాలు విపరీతంగా జరిగాయి. ఇందులో తిరుపతి జిల్లాలో అత్యధికంగా భూములను ఆక్రమించారు. వీటిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం’ అని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నిషేధిత జాబితా నుంచీ ఎక్కువగా భూములు తొలగించి ఫ్రీహోల్డులో ఉంచారని, వాటిలో చాలావరకూ రిజిస్ర్టేషన్లు కూడా జరిగాయని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచీ భూములను తొలగించిన చోట్ల, రిజిస్ట్రేషన్లు జరిగిన చోట్ల క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారన్నారు.
దీనికోసం ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏడుగురు ఆ స్థాయి అధికారులు సర్వే చేస్తున్నారని వివరించారు. నవంబరు 15వ తేదీ నాటికి మొత్తం పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్టు అందజేస్తారని మంత్రి వివరించారు. ఇక, శ్రీవారు కొలువైన తిరుపతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా.. అభివృద్ధిలో భాగస్వామినైనందుకు గర్విస్తున్నానని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. రోజుకు లక్ష మందికిపైగా యాత్రికులు రాకపోకలు సాగించే తిరుపతిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఆతిథ్య రంగంలో కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి అవసరమైన భూములు కేటాయిస్తామన్నారు. పులికాట్ సరస్సు ఆక్రమణలకు గురైందని, సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నీటి నిల్వ తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూడికతీత, ఆక్రమణల తొలగింపునకు సంబంధించి కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందించారని, వాటిపై ప్రభుత్వం తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు.