ఏలూరు జిల్లా, చింతలపూడిలో ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకానికి తల్లీబిడ్డ బలైపోయారు. పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి పట్ల సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. డాక్టర్ లేకుండా వైద్యం చేసి ఇద్దరి మృతికి కారణం అయ్యారు. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహించారు. పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చేతకాకపోతే చెప్పాలి కాని ఇలా ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. చింతలపూడికి చెందిన కోడూరి పరిమళ అనే గర్భిణికి ఈనెల 26న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అయితే రెండ్రోజులపాటు ఆమెను తమ వద్దే పెట్టుకున్న ఆస్పత్రి యాజమాన్యం ఆమెకి సరైన వైద్యం అందించలేదు. సోమవారం అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులు ఎక్కువగా వచ్చాయి.
అయితే ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో సిబ్బందే ఆమెకు డెలివరీ చేసే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సమయంలో పురిటి బిడ్డ మరణించింది. అనంతరం మహిళకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో తమ వల్ల కాదని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. ఈ పరిణామంతో మంగళవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు హుటాహుటిన మహిళను విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించి పరిమళ మృతిచెందింది. ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతదేహాన్ని తీసుకుని చింతలపూడిలోని ప్రైవేటు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇద్దరి ప్రాణాలు తీశారంటూ ఆందోళనకు దిగారు. డాక్టర్ లేకుండా వైద్యం చేసి ప్రాణాలు తీశారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.