మద్యం కుంభకోణంలో మూలాలను సీఐడీ అధికారులు వెలికితీస్తున్నారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మాట తప్పి, మడమ తిప్పి వేల కోట్లు దోచేసిన తీరును సీఐడీ బయటికి తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాల్లో వరుస సోదాల ద్వారా ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల డిస్టిలరీల్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు బుధవారం ఆరు జిల్లాల్లోని 14 చక్కెర ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం తయారీకి ఉపయోగించే మొలాసిస్ గడిచిన ఐదేళ్లలో ఎంత ఉత్పత్తి అయింది? దాన్ని ఏ మద్యం తయారీదారుకు విక్రయించారు? ఎవరెవరికి ఎంత సరఫరా చేశారు? దాని ఖరీదెంత? బిల్లులు మొత్తం వచ్చేశాయా? బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తదితర వివరాలను ఆయా పరిశ్రమల్లోని వ్యక్తులను ప్రశ్నించి నమోదు చేసుకున్నారు. 2019 జూన్ నుంచి గడిచిన ఐదేళ్ల రికార్డులు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రాష్ట్రంలో బీర్ తయారు చేసే నాలుగు కంపెనీల్లోనూ సోదాలు చేపట్టారు.
అక్కడి ఉత్పత్తి, సరఫరా, ఆర్థిక లావాదేవీలు, బిల్లుల వివరాలకు సంబంధించిన రికార్డులు తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ తనిఖీలు జరిగాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ కంపెనీలో డిజిటల్ రికార్డులు, కంప్యూటర్ల డేటాను సీఐడీ అధికారులు పరిశీలించారు. ఆల్కహాల్ స్పిరిట్‌ను తయారు చేసే ఈ కంపెనీ కొన్నేళ్లుగా రాష్ట్రంలోని పలు డిస్టిలరీలకు స్పిరిట్ సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను సీఐడీ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. కేబీకే పరిశ్రమ స్థానికంగా కొంతమంది నుంచి పీడీఎస్ బియ్యాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాన్ని వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి ఆల్కహాల్ తయారీలో వినియోగిస్తున్నారా? లేదా క్యాటిల్ ఫీడ్ తయారీకి వినియోగిస్తున్నారా? అనే కోణంలోను ఆరా తీశారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి సమీపంలో ఉన్న ఎస్‌ఎన్‌జే (ఎస్‌ఎన్ జయమురగన్) బీర్ ఫ్యాక్టరీలోనూ సీఐడీ బృందం మరోసారి ఆకస్మిక సోదాలు చేపట్టింది. అయితే, వివరాలేవీ బయటకు పొక్కకుండా చాలా గోప్యంగా ఉంచారు. పలు కీలకమైన ఫైళ్లు, రికార్డులు, హార్డ్ డిస్క్‌లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా బంటుపల్లి వద్ద యూబీ బేవరేజె్‌సలోనూ సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. బాటిలింగ్ యూనిట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా నాసిరకం మద్యం సరఫరా చేసిన విషయంపై ఆరాతీసినట్టు సమాచారం. అలాగే, విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్ అనుబంధ డిస్టిలరీ ప్లాంట్‌లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈఎన్‌ఏ తయారీ, నిల్వలు, వినియోగంపై ఆరా తీసినట్లు సమాచారం. తనిఖీల సమయంలో మీడియాను అనుమతించలేదు. బయటకు వచ్చాక మీడియా వివరాలు అడిగినా వెల్లడించేందుకు సిట్ సభ్యులు నిరాకరించారు.