పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనే టీడీపీ కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 45.72 మీటర్ల కాంటూరు(ఎత్తు)లోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు ఎత్తుపై గానీ.. నీటి నిల్వపై గానీ తమ సర్కారు ఎంతమాత్రం రాజీపడదన్నారు. 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసి.. నదులను అనుసంధానిస్తామన్నారు. రెండు దశల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనుడు జగన్మోహన్‌రెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ దిశగా పీపీఏతో పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారంటూ సంబంధిత డాక్యుమెంట్లు, లేఖలను మీడియాకు చూపించారు. లేఖల్లో ఫేజ్-1, ఫేజ్-2 అని పేర్కొన్నారని తెలిపారు. 41.15మీటర్ల ఎత్తులో మొదటి దశ పూర్తికి రూ.10,911 కోట్లు ఇవ్వాలని పీపీఏ సీఈవోను జగన్ కోరడం నిజం కాదా అని నిలదీశారు. జగన్ వచ్చాకే 41.15 మీటర్ల కాంటూరును తెరపైకి తెచ్చారని తెలిపారు. ఆయన తప్పిదాల వల్ల 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఐఐటీ-హైదరాబాద్ నిపుణులు వెల్లడించారని చెప్పారు.