ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. దీపం 2.0 పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అయిన శాంతమ్మ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. ఈ సందర్భంగా శాంతమ్మ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారితో కలిసి టీ తాగారు. ఆ సమయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఇతర అధికారులు వెంట ఉన్నారు. ఆ తర్వాత మరో ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఓ మహిళకు ఒంటరి మహిళ పింఛను అందించారు. ఈ సందర్భంగా తనకు ఇల్లు లేదని.. సొంతిల్లు కట్టించి ఇవ్వాలని ఆ మహిళ చేసిన విజ్ఞప్తి స్పందించిన చంద్రబాబు.. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే ఆ ఇంటి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.