అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ ఓపెన్ అయ్యింది.. రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయ్యింది.. మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలన్నారు. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా.. అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, గాలి భానుప్రకాష్‌లు పాల్గొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని.. ఈ విషయంలో తగ్గేదే లేదన్నారు మంత్రి లోకేష్.
తాను యువగళం పాదయాత్ర సమయంలో.. గన్నవరం సభలో కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే రెడ్ బుక్ మూడో చాప్టర్ కూడా తెరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుడునేనని.. యవగళం పాదయాత్రలో తనను ఎంతగానో ఇబ్బందిపెట్టారని.. ఆ సమయంలో తనకు అండగా నిలిచింది టీడీపీ కార్యకర్తలన్నారు. అందుకే ఆ రోజే తాను రెడ్ బుక్ గురించి చెప్పానని.. అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆయన భయపడుతూ గుడ్ బుక్ తీసుకువస్తానని.. నోట్ బుక్‌లో ఏమి రాయాలో అర్థం కావడం లేదని సెటైర్లు పేల్చారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం
తో ముందుకు సాగుతామని..రాష్ట్రం అప్పుడే ముందుకు వెళుతుందన్నారు లోకేష్. రెడ్ బుక్కే కాదు... పెట్టుబడులు కూడా రాష్ట్రానికి తీసుకువెళ్లాలని.. ప్రజలు మనపై గురుతరమైన బాధ్యత పెట్టారన్న సంగతి ఎమ్మెల్యేలు గుర్తించాలన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం అమెరికాలో ఎంతో మందిని కలిసానని.. కానీ ఈ సభ తనకు సూపర్ కిక్ ఇచ్చిందన్నారు. అందరూ ఎన్నారైలు అంటారు.. కానీ తాను మాత్రం ఎమ్మారైలు (ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్) అని పిలుస్తానన్నారు. ఎంతోమంది ఉపాధి అవకాశాల కోసం అమెరికా వచ్చారు.. కానీ వారి ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఉంటుందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తోందన్నారు లోకేష్. టీసీఎస్ ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి చంద్రబాబు కారణమన్నారు.
టీడీపీకి బలం కార్యకర్తలే.. ఎన్టీఆర్ ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో కానీ.. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు కేవలం తెలుగుదేశానికి ఉన్నారన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ గెలుపు ఏ ఒక్కరిదో కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిదన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెట్టి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చేవారని.. కానీ వాటికి కూడా భయపడకుండా అందరూ అండగా నిలబడ్డారన్నారు. ఏపీ ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకి రానంత మెజార్టీని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారన్నారు.