ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించిన అనంతరం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇంటిని సమర్థంగా నడిపించే శక్తి ఆడబిడ్డలకు ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 50 శాతం మంది ఆడబిడ్డలు ఉన్నారని, వారంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. నాడు రాజకీయాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్లు తీసుకువచ్చారని వెల్లడించారు. మహిళల్లో శక్తిసామర్థ్యాలకు కొదవలేదని, అందుకే నాడు డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని చెప్పారు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఎవరూ అపోహ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ కు చెల్లించిన డబ్బు 48 గంటల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రిఫండ్ అవుతుందని వెల్లడించారు. మున్ముందు గ్యాస్ సిలిండర్ కు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చూస్తామని అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, అందుకోసం రూ.2,729 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ పింఛను ఇస్తున్నామని అన్నారు. అంతేగాకుండా, పింఛను మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకోవచ్చని చెప్పారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయండి... పెన్షన్ మీ హక్కు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. పెన్షన్ డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇవ్వాలని ఆదేశించానని తెలిపారు. గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న వారు జవాబుదారీతనంతో ఉండాలని, కానీ వైసీపీ హయాంలో ఉన్నతాధికారులను బెదిరించిన దాఖలాలు చూశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక విధానాలను ప్రక్షాళన చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని ఇంతకుముందే చెప్పానని, ఇసుకలో అక్రమాలకు పాల్పడితే పీడీ చట్టం కింద అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం ఉండదు, బెల్టు షాపులు ఉండవు అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తామని హామీ ఇచ్చామని, ఆ దిశగా తమ కృషి ఫలిస్తోందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కు మార్గం సుగమం చేశామని, విశాఖ రైల్వే జోన్ కు రేపో, ఎల్లుండో భూమిపూజ జరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టెక్కలి లేదా పలాసతో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతామని, మూలపేటలో 10 వేల ఎకరాలతో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ ప్రకటించామని, భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నామని చెప్పారు. ఆకాశమే హద్దుగా యువతను ప్రోత్సహిస్తామని, అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారు కూడా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రేపటి నుంచి రాష్ట్రంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు