గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు.. వరుస దాడులకు పాల్పడుతున్నారు. సైన్యం అప్రమత్తతతో ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెడుతున్నా.. మరికొంతమంది ఉగ్రవాదులు దాడులు, కాల్పులు, పేలుళ్లకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. ఈ ఉగ్రదాడులు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ -టీఆర్‌సీకి సమీపంలో ప్రతీ ఆదివారం నిర్వహించే వారాంతపు సంతలో ముష్కరులు ఈ గ్రనేడ్‌ను పేల్చారు. ఈ గ్రనేడ్ దాడిలో గాయపడినవారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఇక ఈ గ్రనేడ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో జమ్మూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో లష్కరే తోయిబా -ఎల్‌ఈటీకి చెందిన పాకిస్తానీ అగ్ర కమాండర్‌ను భారత సైన్యం మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ ఎత్తున ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించారు.
ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులను అంతం చేసేందుకు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా శనివారం ముగ్గురు టెర్రరిస్ట్‌లను సైన్యం మట్టుబెట్టింది. లష్కరే తోయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్‌ను అంతం చేసినట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. అనంత్‌నాగ్ జిల్లా షాంగస్- లర్నూ ప్రాంతంలో జరిగిన మరో ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉస్మాన్ అనే ఈ లష్కరే తోయిబా కమాండర్ గత 10 ఏళ్లుగా కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల్లో చురుకుగా పనిచేశాడని.. ఇన్‌స్పెక్టర్ మస్రూర్ వానీ హత్యలో కూడా అతని ప్రమేయం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గతేడాది అక్టోబరులో ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతున్న మస్రూర్ వానీని అతి సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.