ఆకివీడు నగర పంచాయతీ రాజకీయం ఆసక్తికరంగా మా రింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. అయితే 13 మంది వైసీపీ కౌన్సిలర్లకు ముగ్గురు హాజరుకాలేదు. టీడీపీ, జనసేన కౌన్సిలర్లు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అంతకంటే మించి ఎమ్మెల్యే రఘురామ తమను పట్టించుకోలేదని ఇక్కడకు వచ్చిన టీడీపీ, జనసేన క్యాడర్ తిరిగి వెళ్లిపోవడం మరింత ఆసక్తిక రంగా మారింది. పార్టీని అంటిపెట్టుకున్నందుకు తమకు ఎమ్మెల్యే తగిన బుద్ధి చెప్పారని పలు వురు శ్రేణులు వాపోయారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఆకివీడులో మా త్రం వైసీపీ పాలనే కొనసాగుతోందని టీడీపీ, జనసేన కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇరు పార్టీల కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, కిమిడి అరుణకుమారి, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, గోపిశెట్టి వెంకట సత్యవతి, గుర్రాన నాగలక్ష్మి, నేరెళ్ళ ప్రసన్న మాట్లాడుతూ ‘నగర పంచాయతీ చైర్మన్ అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని పాలన సాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తు న్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కౌన్సిలర్లతో వార్డుల్లో అభివృద్ధికి కొబ్బరికాయ కొట్టించలేదు. ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ప్రొటోకాల్ పాటించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా తమకు అదేవిధంగా జరుగుతోంది’ అని వాపోయారు.