ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలంకు సీప్లేన్ లో వచ్చారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... సోషల్ మీడియా పోస్టుల అంశంపై స్పందించారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం... ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఎంత కఠినంగా ఉంటానో మీకు తెలుసు... 95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కావడంలేదు... అప్పటికింకా వీళ్లు పుట్టి ఉండరు... ఒకవేళ పుట్టినా గోలీలు ఆడుకుంటూ ఉంటారు... అందుకే 1995 సమయంలోని కాక వీళ్లకు తెలియదు అని వ్యాఖ్యానించారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. "తల్లి, చెల్లి అంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. అయితే మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. రౌడీలు, గూండాల ఆటలు నా దగ్గర సాగవు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని గుర్తించాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలిపెట్టేది లేదు" అని స్పష్టం చేశారు. అంతకుముందు, సీప్లేన్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. సీప్లేన్ అనేది ఒక వినూత్న కార్యక్రమం అని తెలిపారు. విజయవాడ నుంచి శ్రీశైలంకు 40 నిమిషాల్లో చేరుకోవచ్చని అన్నారు. "శ్రీశైలం... భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారు స్వయంభువుగా వెలిసిన పుణ్యక్షేత్రం. ఇక్కడ సాధారణ రోజుల్లో 25 వేల మంది, వారాంతాల్లో 70 వేల మంది, ముఖ్యమైన పండుగ దినాల్లో 1.50 లక్షల మంది వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కావడం, రోడ్లు సరిగా లేకపోవడం, ఒకట్రెండు రోజులు ఉండేందుకు అకామడేషన్ దొరక్కపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. శ్రీశైలం ఒక దివ్యక్షేత్రం మాత్రమే కాదు... పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి ఒక అనుకూలమైన ప్రదేశం. ఇక్కడి తుమ్మలబయలు ప్రాంతాన్ని టైగర్ సఫారీగా తయారుచేసుకోవచ్చు. అక్క మహాదేవి గుహలు, మెడిటేషన్ సెంటర్ కూడా ఉన్నాయి. దేశంలోనే పెద్ద డ్యామ్ లలో శ్రీశైలం ఒకటి. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. డ్యామ్ లో నీళ్లు ఫుల్ గా ఉన్నప్పుడు గేట్లెత్తి నీళ్లు కిందికి వదిలినప్పుడు చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీశైలం రోప్ వే గురించి. నేనే శంకుస్థాపన చేశాను. ఇక్కడికి వచ్చేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది.ఇవాళ సీప్లేన్ లో వచ్చి శ్రీశైలంలో దిగగానే నాకు కూడా ఒక కొత్త అనుభూతి కలిగింది. విమానంలో తిరిగాం, హెలికాప్టర్ లో తిరిగాం... ఇవాళ సీప్లేన్ లో 40 నిమిషాల్లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకున్నాం. మేం దిగింది నీళ్ల మీద కాబట్టి... ఇక్కడి రన్ వే చాలా స్మూత్ గా, పర్ఫెక్ట్ గా ఉంది. ల్యాండైన విషయం కూడా మనకు తెలియదు" అని చంద్రబాబు వివరించారు.