కడపలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. కడప ఏడు రోడ్ల కూడలి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అంటించారు. అందులో కడప బెంగళూరు రైల్వే లైన్ గురించి ప్రస్తావించారు. కడప బెంగళూరు రైల్వే లైన్ వేయించే మొనగాడు, మగోడు.. వైసీపీలో, టీడీపీలో, కాంగ్రెస్‌లో, సీపీఎం పార్టీలో లేరా అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే సుదీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్న కడప బెంగళూరు రైల్వే లైన్ కోసం ఎవరో వినూత్నంగా ఇలా నిరసన తెలిపారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీలలో చలనం తీసుకురావాలనే ఉద్దేశంతో.. అంతటి మొనగాడు ఎవడూ లేరా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఈ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లా మధ్యలో ఉంటుంది. రాయలసీమలోని మిగతా జిల్లాలకు మధ్యలో ఉండటంతో కడప నుంచి బెంగళూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసుల డిమాండ్. ఈ రైల్వే లైన్ ఏర్పాటయితే వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆశ. ఈ నేపథ్యంలో కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటును 2008-09 రైల్వే బడ్జెట్‌లోనే మంజూరు చేశారు. ఆ తర్వాత పనులు కూడా మొదలెట్టారు. అయితే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత ఆగస్టులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి సైతం ఇదే విషయమై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. కడప బెంగళూరు రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని.. పనుల్లో వేగం పెంచాలని కోరారు. 260 కిలోమీటర్ల మేరకు కడప బెంగళూరు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటి వరకూ కేవలం 28 కిలోమీటర్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని ఆగస్టులో కేంద్రమంత్రిని కలిసిన సందర్భంగా అవినాష్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలోనే పనుల్లో వేగం పెంచాలని.. అలాగే అలైన్‌మెంట్‌లోనూ గత వైసీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు. పెండ్లిమర్రి నుంచి పుట్టపర్తి మార్గంలో తాము పంపిన అలైన్‌మెంట్ పరిశీలించాలని కోరారు.