ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత లేకపోవడంతోనే జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నాలాగా 175 ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరని చెప్పారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ కానీ చంద్రబాబు కానీ ఇచ్చేది కాదని ప్రజలే నీకు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలే నడ్డి విరగొట్టి స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ‘‘జగన్ చేసిన నేరాలు, ఘోరాలకు ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ ఇది.
ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే నీ స్వార్థం కోసం నీ ఆస్తులు పెంచుకోవడం కోసం అధికారాన్ని ఉపయోగించుకున్నావు. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్నది కాదని.. అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చాయనేదే ముఖ్యం. ఒక మార్కుతో పాసైన పాస్ అయినట్టే లేకపోతే ఫెయిల్ అయినట్లే. ప్రతిపక్ష హోదాగా ప్రజలు నిన్ను ఫెయిల్ చేశారు. నాకు ఈ కర్మ ఎందుకు పట్టించారనేది ప్రజల్ని అడుగు. వచ్చే సారి ఈ 11 మంది కూడా మిగిలే పరిస్థితి ఉండదు’’ అని చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.