స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతు కుటుంబాల్లో సంతోషం నింపాలని ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. అందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి అచ్చెన్న ప్రసగించారు. ముందుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో భాగంగా రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. "ప్రముఖ కవి గుర్రం జాషువా రైతు గురించి రాసిన పద్యంతో వ్యవసాయ బడ్జెట్ ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నా. రైతుల పరిస్థితి మారాలని, రైతే రాజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు.
ఆరుగాలం ఇంటిల్లిపాదీ శ్రమించి ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మనసా, వాచా, కర్మనా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. అంధకారం అనే అగాధంలో పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించేందుకు దార్శనీకత కలిగిన నాయకుడు కావాలనే ప్రజలు చంద్రబాబును గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. ఏపీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డారు. గత ఐదేళ్లపాటు భూసార పరీక్షలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. కనీసం వారు రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించలేదు. వైసీపీ హయాంలో రబీ కాలంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో బాధ్యతను గాలికి వదిలేశారు. గతేడాది కరవు ప్రాంతాల్లో పంటల బీమా అందించాలనే విచక్షణను వైసీపీ మరిచింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు అభ్యున్నతే లక్ష్యంగా భావించింది. అందుకే వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక చర్యలు చేపట్టింది. భూసార పరీక్షా పత్రాల జారీ, పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన, శిక్షణ కల్పిస్తున్నాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు బాగా కురిసి పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సాయం పెంచాం. ఆ రైతులకు నెల రోజుల్లోనే నగదు చెల్లించేందుకు కంటి మీద కునుకు లేకుండా పని చేశాం" అని తెలిపారు.