వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం నేపథ్యంలో, ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి, జగన్ కు దగ్గరి బంధువు అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబరు 8వ తేదీన వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడి ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడైన సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డే కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే, అతడు తప్పించుకుని పోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు