ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు మళ్లీ ఊపిరొచ్చింది. 2014లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో ఏర్పాటు చేసేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ ఉద్దేశంతోనే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో.. ఈ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరును ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చింది. కార్యాలయాన్ని కూడా విశాఖపట్నానికి మార్చింది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో.. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలోనే విజయవాడ మెట్రో ఏర్పాటుపై ఇటీవలే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ సైతం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఏపీ ప్రభుత్వం కేటాయింపులు చేసింది. 2024-25 వార్షిక బడ్జెట్‌లో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‍కు రూ.50 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులను మెట్రో ప్రాజెక్టుల భూసేకరణలో ఉపయోగించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును కేంద్రం భరించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. దశల వారీగా ఈ మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నారు. మెట్రో ప్రాజెక్టుల విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ కూడా రాశారు. అయితే మెట్రో ప్రాజెక్టుల భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్రమే భరించనుంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌లో రూ. 50 కోట్లు కేటాయించారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్‌లో నిధులు
మరోవైపు వైఎస్సార్ జిల్లా కడప స్టీల్‌ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఈ మేరకు వార్షిక బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించింది. దీంతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదనలపై అప్ డేట్ వచ్చినట్లైంది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గతంలో రెండుసార్లు శంకుస్థాపనలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జేఎస్‌డబ్ల్యూ సంస్థల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. అయితే పనులు కూడా మొదలు కాలేదు. ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు కేటాయించిన నేపథ్యంలో కడప స్టీల్‌ప్లాంట్ ప్రతిపాదనల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది.