భారత స్టాక్ మార్కెట్ కు నేడు కూడా నష్టాలు తప్పలేదు. సెనెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 984 పాయింట్ల నష్టంతో 77,690 వద్ద ముగియగా... నిఫ్టీ 324 పాయింట్లు పతనమై 23,559 వద్ద స్థిరపడింది. మెటల్, ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ట్రెండ్ కనిపించింది. ఈ ధోరణి మార్కెట్లను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసింది. సెన్సెక్స్ టాప్-30 షేర్లలో 27 షేర్లు నష్టాలు చవిచూశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ లాభాల బాటలో పయనించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెసర్లు అమ్మకాలకు దిగడం వల్లే భారత మార్కెట్ సూచీలు వరుసగా ఐదో రోజు కూడా నష్టపోయాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు కార్పొరేట్ సంస్థల ఆదాయాలు నిరాశాజనకంగా ఉండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు కూడా మార్కెట్ నష్టాలకు దారితీశాయన్నది మార్కెట్ వర్గాల మాట.