నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తుంటాయి. వీటి ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంచి ఉద్యోగం సాధించేలా కృషి చేస్తుంటాయి. ప్రభుత్వాలతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామీణ యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తుంటాయి. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కారు డ్రైవింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్ వంటి అంశాలలో ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా కృషి చేస్తుంటాయి.
తాజాగా నిరుద్యోగ యువతకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఇది అందరికీ కాదండోయ్ కేవలం.. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ప్రాంత వాసులకు మాత్రమే. పరవాడ మండలం ఎన్‌టీపీసీ సింహాద్రి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించేందుకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలో ఉండే పదోతరగతి పాసైన నిరుద్యోగ యువతకు విజయవాడలోని పాలిమర్స్ టెక్నాలజీలో ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ ప్రతినిధులు తెలిపారు.
విజయవాడలో ఆరునెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తామన్న ప్రతినిధులు.. ఇందుకు 18 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉన్న నిరుద్యోగ యువత మాత్రమే అర్హులన్నారు. ట్రైనింగ్ సమయంలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయని ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నవారికి విశాఖపట్నం, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటిచోట్ల ప్రముఖ ప్లాస్టిక్ అనుబంధ ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత తమను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కెమికల్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ప్రతినిధి అంజినాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న యువత సంప్రదించాలని ప్రకటనలో కోరారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.