అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలతో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... అదానీ అమెరికా, భారత్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలిపోయిందన్నారు. మోదీ-అదానీ బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమని వ్యాఖ్యానించారు.అమెరికాలో కేసు నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అదానీ తన అవినీతి ద్వారా దేశాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆయనను కాపాడుతున్న సెబి చీఫ్ మాధభి పురి బచ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా అదానీ అరెస్ట్ కాడని కచ్చితంగా చెప్పగలనని... ఎందుకంటే ఆయనను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు.కాగా, భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురు కలిసి అధికారులకు లంచం ఆఫర్ చేసినట్లుగా అమెరికాలో కేసు నమోదైంది. రూ.2,000 కోట్లకు పైగా లంచం ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. అలాగే, బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి.