ఏపీ అసెంబ్లీలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇష్టానుసారం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ వంటి రాజకీయ నేతను ఇప్పటిదాకా చూడలేదని, రాజకీయ ముసుగులోని నేరస్తులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, పీడీ యాక్ట్ కు కూడా మరింత పదునుపెడుతున్నామని చెప్పారు. శిక్ష కఠినంగా ఉంటేనే భయం ఉంటుందని అన్నారు. ఇసుక, బియ్యం అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ఇవాళ మళ్లీ హామీ ఇస్తున్నా... రాష్ట్రంలో శాంతిభద్రతలను అమలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. "ఇంత చేస్తున్నా నాకు తృప్తి లేదు. ఎందుకంటే... ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు వెళ్లి అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కుదుటపడే వరకు మా పోరాటం ఆగదు" అంటూ చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.