మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్షసాధింపులో భాగమే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అని మండిపడ్డారు. ఏ తప్పు చేయని చంద్రబాబు అరెస్టు అక్రమమని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఫైనాన్స్ సెక్రటరి పీవీ రమేష్ సాక్ష్యం చెప్పారని పోలీసులు తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని అన్నారు. దుర్మార్గపు పోలీసు అధికారి కొల్లి రఘురామిరెడ్డి కల్పించిన దొంగ కేసే స్కిల్ డెవలప్ మెంట్‌లో చంద్రబాబు అరెస్టు అని చెప్పారు.
చంద్రబాబు అరెస్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేశారు.‘‘చంద్రబాబు అక్రమ అరెస్టుకు పాత్ర పోషించిన వారిలో ఏ1 జగన్, ఏ2 సజ్జల రామకృష్ణరెడ్డి, యాక్టివ్ పార్ట్ తీసుకున్న వ్యక్తి ఏ3 కొల్లి రఘురామిరెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. చంద్రబాబు రాజమండ్రి జైల్లో సిమెంటు బల్లపై పడుకుంటే మా గుండె తరుక్కుపోయింది, కడుపు మండింది. రూ. 2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ గనుల వెంకటరెడ్డి విజయవాడ జైల్లో ఏసీ రూములో పడుకున్నాడట. చంద్రబాబుకు మాత్రం జైల్లో వేడినీరు అడిగితే దాన్ని రాద్దాంతం చేశారు. విజయవాడ జైల్లో వెంకటరెడ్డికి సకల సౌకర్యాలు కల్పించారు. దీనిపై వెంటనే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా టీడీపీ తరపున కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం మా కుటుంబంపై కక్ష కట్టిందని తల్లి, చెల్లి దూరమైన జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. తల్లి, చెల్లి, బాబాయి గురించి ఏనాడు పట్టించుకోని జగన్ చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉంది’’ అని వర్ల రామయ్య విమర్శించారు.