ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే పీఏసీ సభ్యులకు తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. తెలుగుదేశం తరఫున శ్రీరాం రాజగోపాల్, బీవీ జయ నాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధా కృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలితకుమారి నామినేషన్‌లు వేశారు. అలాగే జనసేన పార్టీ తరఫున పీఏసీ సభ్యత్వానికి పులపర్తి ఆంజనేయులు నామినేషన్ వేశారు. కాగా పీఏసీ చైర్మన్ పదవి జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి నేతలు ఆంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేశారు.