ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురవడం తెలిసిందే. తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన వెలువడింది. తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ... దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈ నెల 25న వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అనంతరం... వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువగా వెళుతుందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.