జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని కూటమి సత్తా చాటుకుంది. శనివారం వెల్లడైన ఫలితాల్లో జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా..జేఎంఎం కూటమి అభ్యర్థులు 56 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాటంటే 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాలను గెలుచుకుంది. ఇది ఇప్పటి వరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 16 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ నాలుగు, సీపీఐ(ఎంఎల్) అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సొరెన్ ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కూటమి పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, వామపక్షాల తరపున దీపాంకర్ భట్టా చార్య తదితరులు పాల్గొంటారని సమాచారం. అయితే, ఈ విషయంపై పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉంది.