కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. ఆ తర్వాత పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శివాలయం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు