దక్షిణ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈనెల 26 నుంచి 28 వరకు దక్షిణ కోస్తా , రాయలసీమ ణలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అదేవిధంగా 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా (South Coast) తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రా (Coastal Andhra)లో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. కోతలు చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న విశాఖపట్నం లో పర్యటించాల్సి ఉండగా తుఫాన్ హెచ్చరికలతో నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయినట్లుగా పీఎంవో (PMO) వెల్లడించింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన, పలు రైల్వే ప్రాజెక్టులు (Railway Projects), జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, తుఫాన్ హెచ్చరికలతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.